న్యూయార్క్: అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది భారతీయ, ప్రవాసాంధ్ర ఐటీ నిపుణులకు ఐబీఎం కీలక షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 1.50 లక్షల మందికి పైగా ఉద్యోగులున్న తన ఐబీఎం కన్సల్టింగ్ విభాగంలో చాలా పాత్రలకు హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ను నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
మారుతున్న క్లయింట్ అవసరాలు, స్థానిక నైపుణ్య కార్మికుల లభ్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐబీఎం పేర్కొంది. ప్రభావితమైన అమెరికా ఉద్యోగులకు నిర్ణయం తీసుకునేందుకు మూడు వారాల గడువు ఇచ్చింది.
ఉద్యోగులు అమెరికా వెలుపల ఉన్న ఐబీఎం కార్యాలయాలకు బదిలీ కావాలని, లేనిపక్షంలో మూడు నెలల వేతనం (సెవరెన్స్ పే) తీసుకుని 2026 డిసెంబర్ 31న కంపెనీ నుంచి తప్పుకోవాలని సూచించింది. నవంబర్ 19 నాటికి ఐబీఎం కెరీర్స్ పోర్టల్లో ఉన్న 1,278 అమెరికేతర కన్సల్టింగ్ ఖాళీల్లో 1,125 భారత్లోనే ఉన్నాయి.
అమెరికాలోనే కొనసాగాలనుకునే హెచ్-1బీ ఉద్యోగులు డిసెంబర్ 31లోగా కొత్త స్పాన్సరింగ్ కంపెనీలో చేరడం లేదా ఇమ్మిగ్రేషన్ న్యాయవాదుల సలహాతో లీగల్ స్టేటస్ కాపాడుకోవడం తప్పనిసరి కానుంది.




