న్యూయార్క్ / హైదరాబాద్: అమెరికాలోని టెక్ నిపుణులు, ముఖ్యంగా భారతీయ, తెలుగు ఐటీ ఉద్యోగులపై ప్రభావం చూపేలా ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. ఐబీఎం కన్సల్టింగ్ విభాగంలోని మెజారిటీ ఉద్యోగాలకు హెచ్-1బీ వీసా, ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ను నిలిపివేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
క్లయింట్ల అవసరాలు మారడం, స్థానికంగా నైపుణ్యం కలిగిన అమెరికన్ ఉద్యోగుల లభ్యత పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐబీఎం పేర్కొంది. ఈ మార్పు వల్ల ప్రభావితమయ్యే విదేశీ నిపుణుల ముందు సంస్థ రెండు మార్గాలను ఉంచింది.
అమెరికా వెలుపల ఉన్న ఇతర దేశాలకు (ప్రధానంగా భారత్ వంటి కేంద్రాలకు) బదిలీ అయ్యేందుకు అంగీకరించడం లేదా మూడు నెలల సెవరెన్స్ పే (పరిహార వేతనం) తీసుకుని సంస్థ నుంచి వైదొలగడం అనే నిర్ణయం తీసుకోవడానికి మూడు వారాల గడువు ఇచ్చింది. బదిలీకి అంగీకరించని వారికి డిసెంబర్ 31, 2026 చివరి పనిదినంగా నిర్ణయించింది.
అయితే ఇప్పటికే గ్రీన్ కార్డ్ కలిగి ఉన్నవారిపై ఈ నిర్ణయం ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 2026లో కొత్త హెచ్-1బీ పిటిషన్లపై యాజమాన్యాలకు 1,00,000 డాలర్ల ఫీజును అమెరికా పొడిగించిన నేపథ్యంలో ఐబీఎం ఈ అడుగు వేయడం గమనార్హం.




