మునుగోడు / హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, కష్టపడి చదివి వారం రోజుల క్రితమే ఉద్యోగం సంపాదించిన తెలుగు యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ జిల్లా మునుగోడు పట్టణానికి చెందిన ఈరమళ్ల ప్రసాద్, శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడు సాయితేజ (25) మృతితో స్వగ్రామంలో విషాదం అలుముకుంది.
అమెరికాలో కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా రోడ్డుపైకి జింక అడ్డువచ్చింది. జింకను ఢీకొట్టడంతో సాయితేజ కారు అక్కడే ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన వాహనాలు ఆయన కారును బలంగా ఢీకొట్టాయి.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొడుకు ఉద్యోగంలో చేరాడన్న సంతోషం ఇంట్లో ఆవిరవకముందే ఈ దుర్వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సాయితేజ భౌతికకాయాన్ని భారత్కు తీసుకొచ్చే ఏర్పాట్లు పూర్తికావడంతో ఆదివారం రాత్రికి మునుగోడుకు చేరుకునే అవకాశం ఉందని కుటుంబ వర్గాలు తెలిపాయి.




