అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పుడు మండల, జిల్లా పరిషత్ పీఠాల ఎన్నికకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 659 మండల పరిషత్‌లు, 28 జిల్లా పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది.

షెడ్యూల్ ఇదీ

  • నవంబర్ 14 లోపు: ఎన్నికైన సభ్యులకు ప్రత్యేక సమావేశం నోటీసులు
  • నవంబర్ 19: మండల కేంద్రాల్లో ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు
  • నవంబర్ 20: జిల్లా కేంద్రాల్లో జెడ్పీ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు
  • ఆ రోజు ఉదయం 10 గంటల వరకు నామినేషన్లు, మధ్యాహ్నం 1 వరకు ఉపసంహరణ; 1 గంటకు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, 3 గంటలకు ప్రధాన పదవుల ఎన్నిక

ఓటింగ్ చేతులెత్తే పద్ధతిలో జరుగుతుంది. పార్టీ విప్ ధిక్కరిస్తే సభ్యత్వం కోల్పోవాల్సి ఉంటుంది; కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు విప్ వర్తించదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరుకావచ్చు కానీ ఓటు వేయలేరు. ప్రతి మండల పరిషత్‌కు ఒకరు, జిల్లా పరిషత్‌కు ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుంటారు. మొత్తం ప్రక్రియను వీడియో తీస్తారు, సీసీటీవీతో పర్యవేక్షిస్తారు; ప్రత్యక్ష ప్రసారానికి కూడా అనుమతి ఉంది.

ఇదిలా ఉండగా, మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికల విజయంతో గర్వపడొద్దని, ఒద్దికగా ఉంటూ 2029 ఎన్నికలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఫలితాలు ప్రజల మద్దతుకు నిదర్శనమని, ప్రతిపక్షం ఆరోపణలు మాని తీర్పును అంగీకరించాలని ఆయన సోమవారం అన్నారు.

అయితే అధికారులు, పోలీసులను వాడుకుని కూటమి గెలిచిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. ‘రిగ్గింగ్ మాస్టర్’ ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతున్నారంటూ సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నవంబర్ 13న వెలువడనుంది.