హైదరాబాద్: ఆక్రమణల చెర నుంచి బయటపడిన మాదాపూర్ తమ్మిడికుంట చెరువు కొత్త రూపు సంతరించుకుంది. హైడ్రా పునరుద్ధరించిన ఈ చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (నవంబర్ 11) ప్రారంభిస్తారు.
ఒకప్పుడు సుమారు 30 ఎకరాల్లో ఉన్న చెరువు ఆక్రమణలతో 14 ఎకరాలకు తగ్గిపోయింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను 2024 ఆగస్టు 24న హైడ్రా కూల్చివేసింది. తర్వాత మిగతా ఆక్రమణలనూ తొలగించి 16 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ భూమి విలువ ₹1,200 కోట్లకు పైనే ఉంటుందని హైడ్రా అంచనా. అప్పట్లో ఈ కూల్చివేత పెద్ద వివాదానికి దారితీసింది.
₹20 కోట్లతో చేసిన పనులు
- 15 అడుగుల లోతు వరకు పూడికతీత; ప్లాస్టిక్, బయోమెడికల్, నిర్మాణ వ్యర్థాల తొలగింపు
- మూడు ఇన్‌లెట్లు, ఒక అవుట్‌లెట్ పునర్నిర్మాణం; 1,200 మి.మీ. పైప్‌లైన్‌తో మురుగు నీటి మళ్లింపు
- 1.25 కి.మీ. వాకింగ్ ట్రాక్, రెండు గెజిబోలు, యోగా వేదిక, రోజ్ గార్డెన్, ఓపెన్ జిమ్‌లు
- ఎఫ్‌టీఎల్ సరిహద్దులో ప్రహరీ, ఫెన్సింగ్; మురుగు శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) ప్రతిపాదన
తొలి దశలో హైడ్రా ఆరు చెరువులను పునరుద్ధరిస్తోంది. పాతబస్తీలోని బమ్ రుకున్ ఉద్ దౌలా చెరువు, అంబర్‌పేట బతుకమ్మ కుంట, కూకట్‌పల్లి నల్ల చెరువు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తమ్మిడికుంటతో పాటు మాదాపూర్ సున్నం చెరువు, ఉప్పల్ నల్ల చెరువు ప్రారంభం కావాల్సి ఉంది.




