హైదరాబాద్: రాష్ట్రంలో జనగణన–2027 రెండో దశకు ముహూర్తం ఖరారైంది. జనాభా లెక్కల సేకరణ షెడ్యూల్ను ప్రకటిస్తూ సాధారణ పరిపాలన శాఖ సోమవారం జీవో ఎంఎస్ నంబర్ 155 జారీ చేసింది. కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ను ప్రభుత్వం తెలంగాణ గెజిట్లో పునఃప్రచురించింది.
ముఖ్య తేదీలు
- ఆన్లైన్లో స్వీయ గణన: 2027 జనవరి 10 నుంచి 24 వరకు
- ఇంటింటి జనాభా లెక్కల సేకరణ: జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు
- రివిజనల్ రౌండ్: మార్చి 1 నుంచి 5 వరకు
- జనగణన రిఫరెన్స్ తేదీ: 2027 మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలు
ఎన్యుమరేటర్లు ఇంటికి రాకముందే కుటుంబ వివరాలను ప్రజలే ఆన్లైన్లో నమోదు చేసుకునే వీలుంటుంది. ఇంటింటి సర్వేలో వ్యక్తిగత, జనాభా, సామాజిక–ఆర్థిక వివరాలతో పాటు కులం, మతం వివరాలనూ సేకరిస్తారు.
రెండో దశ జనగణనకు కేంద్ర హోంశాఖ అక్టోబర్ 30న నోటిఫికేషన్ ఇచ్చింది. జనగణన పనులకు సిద్ధం కావాలని అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఏ ప్రశ్నలు అడుగుతారు, ఎంతమంది సిబ్బందిని నియమిస్తారు అనే వివరాలు తదుపరి ఉత్తర్వుల్లో వెల్లడవుతాయి.




