లండన్: ఆంధ్రప్రదేశ్‌ను వైద్య, ఆరోగ్య రంగంలో అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీర పాండ్యన్ నేతృత్వంలోని బృందం ఐదు రోజుల యూకే పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహించింది. నవంబర్ 17న ప్రారంభమైన ఈ పర్యటనలో యూరప్ ప్రత్యేక ప్రతినిధి జయకుమార్ గుంటుపల్లి సమన్వయకర్తగా వ్యవహరించారు.
పర్యటనలో భాగంగా లండన్‌లోని హౌస్ ఆఫ్ పార్లమెంట్‌లో యూకే తెలుగు వైద్యులు, వైద్య రంగ నిపుణులు, ప్రవాసాంధ్రులతో ప్రత్యేక భేటీ జరిగింది. ఏపీలో ఆధునిక వైద్య సేవల విస్తరణకు యూకేలోని తెలుగు వైద్య నిపుణుల అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసే మార్గాలపై చర్చించారు.
చర్చలు జరిపిన ప్రధాన బ్రిటన్ సంస్థలు
- యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL), లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE), ఇంపీరియల్ కాలేజ్ లండన్
- నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS UK), క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్
- గేట్స్ ఫౌండేషన్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్
వైద్య విద్య నాణ్యత పెంపు, పరిశోధనలు, డిజిటల్ హెల్త్, వైద్య రంగంలో AI సాంకేతికత వినియోగం, అంతర్జాతీయ పెట్టుబడులపై ఆయా సంస్థల ప్రతినిధులతో బృందం చర్చలు జరిపింది.
ఈ కార్యక్రమాల సమన్వయంలో యూకే ప్రవాసాంధ్రులు, ఏపీఎన్‌ఆర్‌టీ (APNRT) కోఆర్డినేటర్లు సహకరించారు. ఈ చర్చలు త్వరలో ఆయా సంస్థలతో అధికారిక భాగస్వామ్యాలుగా రూపుదిద్దుకునే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.




