వైద్యారోగ్య శాఖలోని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ (డీహెచ్‌) విభాగంలో ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులు విచారణ చేపట్టారు. గత కొన్ని నెలలుగా ఈ విభాగంలో అవినీతి జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరిగింది.

ఆరుగురు సీఎంవో అధికారులు డీహెచ్‌లోని కీలక అధికారి వద్ద కూర్చుని విచారణ జరిపారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లను తెప్పించుకుని ఆ అధికారిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

విభాగంలో దస్త్రాలు ఎందుకు ఆగుతున్నాయని, విజిలెన్స్‌ ఫైళ్లు క్లియర్‌ చేయడం వెనుక జరుగుతున్న వసూళ్ల దందాపై ఆరా తీశారు. నర్సింగ్‌ ఉద్యోగాల్లో చేరిన సిబ్బంది రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన ఫైళ్లను క్లియర్‌ చేయకుండా ఆపడంపైనా ప్రశ్నించారు.

ఇన్‌వార్డులో ఫైళ్లు నెలల తరబడి ఆగడంపై, అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను తొక్కిపెట్టడంపై సీఎంవో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.