మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు.
ఆసుపత్రిలో రోగుల సంఖ్య, వివిధ వ్యాధుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మందుల లభ్యత, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
దగ్గు, జలుబు, జ్వరాలతో పాటు డెంగ్యూ లక్షణాలతో వస్తున్న రోగుల చికిత్స వివరాలపై కలెక్టర్ సమీక్షించారు. ఆసుపత్రిలో అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రిలోని ల్యాబ్‌ను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. రోగుల వివరాలను, వ్యాధుల సమాచారాన్ని క్రమబద్ధంగా నమోదు చేయాలని, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, అందిస్తున్న ఆహారం నాణ్యత గురించి ఆరా తీశారు.