దుబాయి: గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలను ఏకతాటిపైకి తెచ్చేలా దుబాయి పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో స్థిరపడిన తెలుగు మూలాలున్న పద్మశాలీ కుటుంబాలు ఈ ఆత్మీయ కలయికలో పాల్గొన్నాయి.

సంఘం మహిళా సభ్యులు యోగిత గాలిపెల్లి, దీపిక అలిగేటి, జయ బద్దూరి, లక్ష్మి గుంటుక, అనూజ అనుమల్ల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. జంటల కోసం ప్రత్యేక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

దుబాయిలోని మెట్రోపోలిటన్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని నందిని ఏలిగేటి చిన్నారుల ఆటల పోటీలను ఆకట్టుకునేలా నిర్వహించారు. వివిధ క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనలతో రోజంతా సందడి వాతావరణం నెలకొంది.

సంఘం బాధ్యులు సదానందం, లక్ష్మీనారాయణ, జగదీష్, సుధాకర్, అశోక్, శ్రీనివాస్ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. విదేశాల్లో ఉన్నా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడమే ఈ వనభోజనాల ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.