గంజాయికి బానిసైన తమ పిల్లలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఈగల్ ఫోర్స్‌కు సమాచారం ఇస్తున్నారు. హైదరాబాద్‌లో గంజాయి అమ్మకాలపై సీనియర్ సిటిజన్ల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. టోల్ ఫ్రీ నంబర్ 1908కి ఏడాదిలో 1193 కాల్స్ వచ్చాయని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండి తెలిపారు. ఈ కాల్స్ ఆధారంగా ఈగల్ ఫోర్స్ డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది, గంజాయి విక్రేతలను పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా పెట్టింది.
ఒక తల్లిదండ్రులు తమ కుమారుడు రెండేళ్లుగా గంజాయికి బానిసయ్యాడని, ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్పు రాలేదని 1908కి ఫోన్ చేసి చెప్పారు. తమ కుమారుడికి ఎక్కడి నుంచి గంజాయి అందుతుందో పూసగుచ్చినట్లు వివరించారు. ఈ సమాచారం ఆధారంగా నిఘా పెట్టిన ఈగల్ ఫోర్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి గంజాయి విక్రేతలను పట్టుకున్నారు. ఇలాంటి ఫిర్యాదులు పెరగడంతో ఈగల్ ఫోర్స్ తమ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసింది.