చిత్తూరు / అమరావతి: 1983లో స్థాపించిన తర్వాత తొలిసారిగా తమిళనాడు వెలుపల విస్తరిస్తున్న తిరుప్పూర్ వస్త్ర ఎగుమతి సంస్థ ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ క్లోతింగ్, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ₹266.2 కోట్ల (28.75 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో స్మార్ట్ గార్మెంట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.
మూడు యూనిట్లుగా రానున్న ఈ ప్రాజెక్టులో రూ. 233.4 కోట్లు స్థిర మూలధన పెట్టుబడిగా ఉండనుంది. గండ్లకొత్తూరులో లక్ష చదరపు అడుగుల లీజు భవనంలో రూ. 25.8 కోట్లతో తొలి యూనిట్ 2027 ఏప్రిల్లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. తేనబండ గ్రామంలో రూ. 163.3 కోట్లు, రూ. 77.1 కోట్ల పెట్టుబడితో మిగిలిన రెండు యూనిట్లు 2028 అక్టోబర్, 2029 జూలైలో మొదలవుతాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా 3,000కు పైగా ప్రత్యక్ష, 1,500 పరోక్ష ఉపాధి అవకాశాలతో మొత్తం సుమారు 4,500 ఉద్యోగాలు వస్తాయని అధికారులు తెలిపారు. ఇక్కడ నీటి వినియోగం ఎక్కువగా ఉండే డయింగ్ లేదా వెట్ ప్రాసెసింగ్ ఉండదని, కటింగ్ నుంచి ప్యాకింగ్ వరకు పూర్తిగా ఆటోమేటెడ్ స్మార్ట్ తయారీ ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ఏపీ టెక్స్టైల్, అపెరల్ పాలసీ (4.0) 2024–29 కింద రూ. 200 కోట్ల పైబడిన ఈ పెట్టుబడిని 'మెగా ప్రాజెక్టు'గా ప్రభుత్వం వర్గీకరించింది. దీని ద్వారా 15 ఏళ్లలో రాష్ట్రానికి ఎస్జీఎస్టీ, విద్యుత్, నీటి ఛార్జీల రూపంలో ₹74.88 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.




