హైదరాబాద్: అంతర్జాతీయ ఆతిథ్య రంగ సంస్థ 'హోటల్101 గ్లోబల్ హోల్డింగ్స్ కార్ప్' (నాస్డాక్: హెచ్బీఎన్బీ) శుక్రవారం హైదరాబాద్‌లోని కోకాపేట కేంద్రంగా భారత్‌లో తన తొలి ప్రాజెక్టును ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన పూజా క్రాఫ్టెడ్ హోమ్స్ (పీసీహెచ్)తో కలిసి కీలక జాయింట్ వెంచర్ ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
సీబీఆర్ఈ ఇండియా సహకారంతో కుదిరిన ఈ ప్రాజెక్టు అంచనా విలువ రూ.595 కోట్లు (64.4 మిలియన్ డాలర్లు) కాగా, ఇందులో సుమారు 625 గదులు ఉండనున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీకి సమీపంలోని కోకాపేటలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 36 అంతస్తుల 'ది హార్వెస్ట్ బిల్డింగ్'లోని పై ఏడు అంతస్తుల్లో ఈ కాండోటెల్ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది.
హైదరాబాద్‌లోని గదుల సంఖ్య పరంగా ఇది అతిపెద్ద హోటల్‌గా నిలుస్తుందని, 2029 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ పేర్కొంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హోటల్101 వ్యవస్థాపకుడు ఎడ్గర్ సియా-2, సీఈవో హన్నా యూలో-లుసిని, పూజా క్రాఫ్టెడ్ హోమ్స్ ప్రతినిధులు శౌరీ రెడ్డి దుగ్గింపూడి, జోసెఫ్ కిరణ్ కుమార్ రెడ్డి బసాని ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఫిలిప్పీన్స్‌కు చెందిన డబుల్డ్రాగన్ కార్ప్ అనుబంధ సంస్థ అయిన హోటల్101 గ్లోబల్, నియంత్రణ సంస్థల ఆమోదాలు పూర్తయిన తర్వాత ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లనుంది.




