హైదరాబాద్: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కూకట్‌పల్లి మండలం మూసాపేటలోని హుడా ట్రక్ పార్క్ ప్లాట్ నంబర్ 1 (3.15 ఎకరాలు) ఈ-వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై (PIL 37, 38/2026) తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. యాక్టింగ్ సీజే జస్టిస్ పి. సామ్ కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను విన్నది.
హైకోర్టు ఎలాంటి మధ్యంతర స్టే ఇవ్వకపోవడంతో శుక్రవారం (నవంబర్ 27) ఉదయం షెడ్యూల్ ప్రకారమే ఈ-వేలం జరుగుతుందని హెచ్‌ఎండీఏ గురువారం రాత్రి 10:07 గంటలకు అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. జాతీయ రహదారి-65 పక్కనే సర్వే నంబర్లు 121/P నుంచి 157 వరకు విస్తరించి ఉన్న ఈ భూమి వేలం కోసం అక్టోబర్ 24న నోటిఫికేషన్ జారీ అయింది.
45 ఏళ్ల క్రితం ట్రక్ పార్క్ కోసం సేకరించిన ప్రభుత్వ భూమిని ఎలాంటి అధ్యయనం లేకుండా వాణిజ్య సముదాయాలు, మాల్స్ కోసం వేలం వేయడం సరికాదని పిటిషనర్లు (కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాధవరం కాంతారావు) తరఫు సీనియర్ న్యాయవాదులు వాదించారు.
అయితే ఈ వ్యాజ్యాలు రాజకీయ ప్రేరేపితమని అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. నిధుల కొరతతో దశాబ్దాల నాటి ట్రక్ టెర్మినల్ ప్లాన్ నిలిచిపోయిందని, ప్రస్తుతం ఆ ప్రాంతం నివాస కాలనీగా మారిందని, పటాన్‌చెరు, బాటసింగారం, ఇబ్రహీంపట్నం, మంగళపల్లిలో ప్రత్యామ్నాయ ట్రక్ పార్కింగ్‌లు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. నేటి ఈ-వేలం ఫలితంతో పాటు హైకోర్టు తుది తీర్పుపై రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.




