ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ పేరుతో తప్పుదోవ పట్టించే ఆరోగ్య ప్రకటనలు చేసినందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నోటీసులు జారీ చేసింది. జెమిని ఎడిబుల్స్, అలాగే ఈ-కామర్స్ సంస్థలైన బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఈ నోటీసులు అందాయి.
ఈ నూనె చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని కంపెనీలు ప్రచారం చేశాయి. అంతేకాకుండా, ఇందులో 10,000 పీపీఎంకు పైగా సహజ ఒరైజనాల్ ఉంటుందని కూడా పేర్కొన్నాయి.
అయితే, వంటనూనెలపై గుండె సంబంధిత లేదా కొలెస్ట్రాల్ గురించి ఇలాంటి వాదనలకు ఆహార నిబంధనలు (2018) ప్రకారం అనుమతి లేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. ఈ ప్రచారాలు నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.
ఈ ప్రకటనలపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆయా కంపెనీలను ఆదేశించింది. దీనిపై తక్షణమే స్పందించాలని కోరింది.