హైదరాబాద్ గోషామహల్ లోని చూడి బజార్ లో అనుమతులు లేకుండా నడుస్తున్న ఒక గోదాముపై పోలీసులు దాడి చేసి భారీగా బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బాణసంచా విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా.

కమిషనర్ టాస్క్ ఫోర్స్, గోల్కొండ జోన్ బృందం, గోషామహల్ పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు మొత్తం 569 కార్టన్ల బాణసంచా, వివిధ రకాల బొమ్మ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఎంవి కార్సెయిర్ (లెపర్డ్ కింగ్), వండర్ త్రో, ఒరిజినల్ మ్యాజిక్ కలర్ షాట్స్, ఒరిజినల్ లెపర్డ్ కింగ్, ఒరిజినల్ కలర్ పాపప్స్ వంటి బ్రాండ్ల బాణసంచా ఇందులో ఉంది.

చూడి బజార్ లోని 14-9-139 చిరునామాలో ఉన్న గోదాములో ఈ అక్రమ నిల్వలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ చేయడం చట్టరీత్యా నేరం.