హైదరాబాద్: దీపావళి తర్వాత యాదవులు ఘనంగా జరుపుకునే సదర్ ఉత్సవ మేళాకు నారాయణగూడ ముస్తాబైంది. వైఎంసీఏ వద్ద మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకు జరిగే మేళా కోసం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ తెలిపారు.

అలంకరించిన దున్నపోతులను ఊరేగించడం, వాటితో విన్యాసాలు చేయించడం సదర్ ప్రత్యేకత. అందుకే దీనిని ‘దున్నపోతుల పండుగ’ అని కూడా పిలుస్తారు. నారాయణగూడ వైఎంసీఏ వద్ద జరిగే ‘పెద్ద సదర్’కు నగరం నలుమూలల నుంచి జనం తరలివస్తారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

  • ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, క్రౌన్ కేఫ్ నుంచి వైఎంసీఏ వైపు వాహనాలను నారాయణగూడ క్రాస్‌రోడ్స్ వద్ద హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు
  • రాంకోఠి, లింగంపల్లి క్రాస్‌రోడ్స్ నుంచి వచ్చే వాహనాలు కాచిగూడ క్రాస్‌రోడ్స్ వద్ద సుల్తాన్‌బజార్ వైపు
  • బర్కత్‌పుర చమన్ నుంచి వైఎంసీఏ వైపు వాహనాలు పోస్టాఫీస్ జంక్షన్ వద్ద క్రౌన్ కేఫ్ వైపు
  • సికింద్రాబాద్–కోఠి ఆర్టీసీ బస్సులు బర్కత్‌పుర, పోస్టాఫీస్ జంక్షన్, బాగ్ లింగంపల్లి, వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా

సందర్శకులు కేశవ్ మెమోరియల్ కాలేజీ మైదానంలో వాహనాలు నిలపవచ్చు. అక్కడ 400 ద్విచక్ర వాహనాలు, 400 కార్లు నిలిపే వీలుంది. అత్యవసర ప్రయాణ సహాయానికి 9010203626 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.