అమరావతి: తెలుగు భాషా సాహిత్యాల పరిరక్షకుడు చార్లెస్ ఫిలిప్ (సీపీ) బ్రౌన్ 228వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నివాళులర్పించారు. ‘తెలుగు భాషా వికాసానికి బ్రౌన్ చేసిన నిస్వార్థ సేవలే మనకు అసలైన స్ఫూర్తి’ అని ఆయన పేర్కొన్నారు. విదేశీయుడైనా తన జీవితాన్ని, సంపాదనను తెలుగుకు అంకితం చేశారని కొనియాడారు. పాఠశాలల్లో తెలుగు బోధన, పాలనలో తెలుగుకు ప్రాధాన్యం, అంతరించిపోతున్న ప్రాచీన గ్రంథాల డిజిటలీకరణ అవసరమని అన్నారు.

‘తెలుగు భాష వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు సీపీ బ్రౌన్’ అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎక్స్‌లో నివాళులర్పించారు.

బ్రౌన్ సేవలు

  • 1798 నవంబర్ 10న కలకత్తాలో జననం; 1884 డిసెంబర్ 12న మరణం
  • 1820 ఆగస్టులో కడప కలెక్టరేట్‌లో ఉద్యోగంలో చేరారు; 1822లో మచిలీపట్నంలో అసిస్టెంట్ జడ్జిగా బదిలీ
  • వేమన 693 పద్యాలను ఆంగ్లంలోకి అనువదించి 1829లో ప్రచురించారు
  • తెలుగు–ఇంగ్లిష్, ఇంగ్లిష్–తెలుగు నిఘంటువులు 1852–54 మధ్య వెలువడ్డాయి
  • తాళపత్ర గ్రంథాలను సొంత ఖర్చుతో సేకరించి పండితులతో ముద్రణకు సిద్ధం చేయించారు

కడపలో బ్రౌన్ బంగ్లా ఉన్న చోటే ఇప్పుడు సీపీ బ్రౌన్ స్మారక గ్రంథాలయం ఉంది. జానమద్ది హనుమచ్ఛాస్త్రి కృషితో ఏర్పాటైన ఈ గ్రంథాలయాన్ని యోగి వేమన విశ్వవిద్యాలయం భాషా పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేసింది.