హైదరాబాద్ నగరంలో నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వంద వాహనాలను సీజ్ చేసి, వాటిని నడుపుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి, చట్ట నిబంధనలను ఉల్లంఘించడానికి కొందరు నకిలీ నంబర్ ప్లేట్లను వాడుతున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.

సీజ్ చేసిన వాహనాల్లో 88 ద్విచక్ర వాహనాలు, 12 కార్లు ఉన్నాయి. నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను ఉపయోగించడం చట్ట ఉల్లంఘన అని పోలీసులు తెలిపారు.

నకిలీ నంబర్ ప్లేట్లు ట్రాఫిక్ నిర్వహణకు, నేర నియంత్రణకు, ప్రజల భద్రతకు సవాలుగా మారాయని అదనపు సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ స్పష్టం చేశారు.

1988 మోటారు వాహనాల చట్టం, 1989 సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలు, ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్‌ఎస్‌ఆర్​పీ నిబంధనల ప్రకారం ప్రతి వాహనదారుడు తమ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని ఆయన సూచించారు.