హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో 29 ఏళ్ల ప్రవాస భారతీయుడు రాఘుల్ ఆనందకృష్ణన్‌ను యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కౌంటీ జైలు శిక్ష పూర్తి చేసుకున్న వెంటనే ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని తమ కస్టడీలోకి తీసుకున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు.

కోర్టు రికార్డుల ప్రకారం, గత జూన్‌లో ఆస్టిన్‌లోని ఒక వైర్‌లెస్ స్టోర్‌లో పనిచేస్తున్న సమయంలో కస్టమర్ ఫోన్ నుంచి రెండు వ్యక్తిగత ఫొటోలను యాపిల్ 'ఎయిర్‌డ్రాప్' ద్వారా తన ఫోన్‌కు బదిలీ చేసుకున్నట్లు రాఘుల్‌పై అభియోగాలు నమోదయ్యాయి. కస్టమర్ స్నాప్‌చాట్ ఖాతాను కూడా అనుమతి లేకుండా తెరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.

జూన్ 7న ఆస్టిన్ పోలీసులు అతడిని అరెస్టు చేసి, 10,000 డాలర్ల బాండ్‌తో ట్రావిస్ కౌంటీ జైలుకు తరలించారు. అనంతరం కోర్టులో నేరం రుజువు కావడంతో కౌంటీ జైలు శిక్ష అనుభవించాడు.

జైలు శిక్ష ముగియడంతో ఇమ్మిగ్రేషన్ కోర్టు విచారణ పూర్తయ్యే వరకు అతడిని ఐసీఈ నిర్బంధంలో ఉంచనున్నారు. విదేశాల్లో వీసా, నివాస హోదా కలిగిన ప్రవాసులు స్థానిక చట్టాల ఉల్లంఘనలకు పాల్పడితే బహిష్కరణ ముప్పు తప్పదని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.