బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వందేభారత్-2026లో విజేతగా నిలిచిన కైటెకి ఇన్నోవేషన్స్ వ్యవస్థాపకుడు రఘుదత్ డేగలను శనివారం అభినందించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో రఘుదత్ డేగలను కలిసి కేటీఆర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
దివ్యాంగుల జీవితాల్లో సౌలభ్యం, ఆత్మగౌరవం, స్వతంత్రతను పెంచే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో రఘుదత్ డేగలు చేస్తున్న కృషిని కేటీఆర్ ప్రశంసించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కైటెకి ఇన్నోవేషన్స్, వందే భారత్-2026 పోటీలో 26,000కు పైగా దరఖాస్తుల నుండి టాప్-10 ఆవిష్కర్తలలో ఒకటిగా నిలిచింది. అహ్మదాబాద్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో దివ్యాంగుల విభాగంలో అవార్డుతో పాటు రూ.11 లక్షల నగదు బహుమతిని అందుకుంది.
ఈ సంస్థ రూపొందించిన 'గుకో బిడెట్' అనే ఆవిష్కరణ వ్యక్తిగత పరిశుభ్రతను సులభతరం చేస్తుంది. బహిరంగ మరుగుదొడ్లలో దివ్యాంగులు స్వయంగా ఉపయోగించుకునేలా దీనిని రూపొందించారు.