వరంగల్‌ కేంద్రంగా రూపుదిద్దుకున్న స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌ ‘రుటూర్‌’ ఆవిష్కరణ రవాణా రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

తెలంగాణభవన్‌లో శుక్రవారం నిర్వాహకులతో కలిసి కేటీఆర్‌ రుటూర్‌ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రుటూర్‌ ప్రత్యేకత గురించి ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.

రుటూర్‌ సంస్థను స్థాపించిన అశోక్‌ను, సీఈవో నిఖిల్‌, సీవోవో క్రాంతి, సీఎఫ్‌వో అక్షయ్‌కు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. వారి కృషిని అభినందించారు.

రుటూర్‌ స్టార్టప్‌ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌ వ్యవస్థకు మరింత తోడ్పాటునందించాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. ఇది స్థానిక ఆవిష్కరణలకు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.

నమ్మకమైన రైడ్‌ సేవలు, వినూత్న సాంకేతికత, డ్రైవర్ల నుంచి కమీషన్లు వసూలు చేయకుండా ప్రయాణికులకు సరసమైన ధరల్లో రవాణా సేవలందించాలని కేటీఆర్‌ అభిలషించారు. ఇది వినియోగదారులకు, డ్రైవర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు.

తెలంగాణలో స్టార్టప్‌లకు ప్రోత్సాహం లభిస్తుందని, రుటూర్‌ వంటి సంస్థలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తాయని ఈ పరిణామం సూచిస్తుంది. ఇది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.