విదేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగాలంటూ ఆశ చూపి యువతను రష్యా సైన్యంలోకి పంపుతున్న మోసపూరిత ఏజెంట్లపై అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం బుధవారం (నవంబర్ 4) పత్రికా ప్రకటన ద్వారా హెచ్చరించింది. ఉత్తరాంధ్ర యువతను కొన్ని ప్రైవేటు శిక్షణ సంస్థలు, అక్రమ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకుంటున్నాయని పేర్కొంది.
వంశీ ఉదంతం
విశాఖపట్నానికి చెందిన జె. వంశీ పండ్ల ప్యాకింగ్ పని కోసం రష్యా వెళ్లారు. అక్కడ పని దొరక్కపోవడంతో, యుక్రెయిన్‌లో ఎక్కువ జీతం ఇప్పిస్తానన్న ఓ నేపాలీ వ్యక్తి ఆయనను రష్యా సైన్యంలో చేర్పించాడని ఆరోపణ. రష్యన్ భాషలోని పత్రాలపై అర్థం కాకుండానే సంతకాలు చేయించారని, తమకు రష్యా పౌరసత్వం వచ్చిందని తర్వాతే తెలిసిందని, సరిహద్దు యుద్ధ ప్రాంతాలకు పంపుతున్నారని వంశీ, మరో నలుగురు భారతీయులు వీడియోలో చెప్పారు. తన కుమారుడిని క్షేమంగా తీసుకురావాలని వంశీ తల్లి జె. అప్పలకొండ కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
ఐదుగురిలో ముగ్గురిని దాదాపు రెండు నెలల క్రితమే యుద్ధ రంగానికి పంపారని, వారి ఆచూకీ తెలియడం లేదని న్యూస్‌మీటర్, గ్రేట్ ఆంధ్ర పేర్కొన్నాయి. వెంటనే సంబంధిత అధికారులతో సమన్వయం చేసి వారిని క్షేమంగా తీసుకురావాలని తన కార్యాలయాన్ని ఆదేశించినట్లు మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో తెలిపారు.
ప్రభుత్వ సూచనలు
- ఎక్కువ జీతం, సులువుగా నియామకం, తొందరగా విదేశాలకు పంపుతామనే ప్రకటనలను నమ్మవద్దు.
- గుర్తింపు లేని శిక్షణ సంస్థలు, ఏజెంట్లకు దూరంగా ఉండాలి.
- ప్రయాణానికి ముందే ఉద్యోగ ఒప్పందం, వీసా, పని స్వభావం, ఏజెంట్ చట్టబద్ధతను అధికారిక సంస్థల ద్వారా నిర్ధారించుకోవాలి.
- అనుమానాస్పద ఆఫర్లు, ఏజెంట్ల గురించి ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేయాలి.




