రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబురాల సందర్భంగా జరిగిన ప్రమాదంలో సోని అనే విద్యార్థిని మృతిచెందగా, మీన అనే మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా చర్యల లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
వేలాది మంది హాజరైన ఈ వేడుకలకు అగ్నిమాపక భద్రత, తొక్కిసలాట నివారణ, అత్యవసర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయలేదని శ్రవణ్ ఆరోపించారు. అంతేకాకుండా, పోలీస్, మున్సిపల్ అనుమతులు లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆయన తెలిపారు.
విద్యాసంస్థలు విద్యను వినోదంగా, వ్యాపారంగా మార్చి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం క్షమించరాని నేరమని శ్రవణ్ మండిపడ్డారు. పేద కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, నిర్వాహకులపై బీఎన్‌ఎస్ కఠిన సెక్షన్ల కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
మృతిచెందిన విద్యార్థిని కుటుంబానికి కళాశాల నిధుల నుంచి రూ. కోటి పరిహారంతో పాటు ప్రభుత్వ ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. గాయపడిన విద్యార్థినికి కార్పొరేట్ దవాఖానలో ఉచిత వైద్యం అందించాలని ఆయన కోరారు.