వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ, తెలుగు విద్యార్థులకు ఊరటనిచ్చే కొత్త వర్క్ వీసా నిబంధనలు సోమవారం (నవంబర్ 23) నుంచి అమల్లోకి వచ్చాయి. పోస్ట్-స్టడీ వర్క్ వీసా (PSWV), కొత్తగా ప్రవేశపెట్టిన షార్ట్-టర్మ్ గ్రాడ్యుయేట్ వర్క్ వీసా దరఖాస్తులను ఇమ్మిగ్రేషన్ న్యూజిలాండ్ (INZ) తమ ఆధునికీకరించిన 'ఇమ్మిగ్రేషన్ ఆన్‌లైన్' పోర్టల్‌లోకి మార్చింది.

వాస్తవానికి ఈ మార్పులు నవంబర్ 16నే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, నవంబర్ 13న మైక్రోసాఫ్ట్ వ్యవస్థల్లో తలెత్తిన అంతర్జాతీయ సాంకేతిక అంతరాయం కారణంగా వారం రోజులు వాయిదా పడ్డాయి. అయితే, భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)లో భాగంగా అర్హులైన భారతీయ పీహెచ్‌డీ పట్టభద్రులకు పోస్ట్-స్టడీ వర్క్ వీసా కాలాన్ని మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచే నిబంధన నవంబర్ 16 నుంచే అమల్లోకి వచ్చింది.

కొత్త నిబంధనల ప్రకారం భారత్ లేదా ఇతర దేశాల్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, న్యూజిలాండ్‌లో ఫుల్-టైమ్ లెవల్ 7 గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన వారు ఏ ఉద్యోగంలోనైనా ఏడాది వరకు పని చేసుకునే పోస్ట్-స్టడీ వర్క్ వీసాకు అర్హులవుతారు. ఇందుకు ప్రత్యేక క్వాలిఫికేషన్ అసెస్‌మెంట్ అవసరం లేదు. ఇక పీఎస్‌డబ్ల్యూవీకి అర్హత లేని లెవల్ 5 నుంచి 7 డిప్లొమా విద్యార్థుల కోసం (కనీసం 24 వారాలు చదివిన వారికి) ఆరు నెలల షార్ట్-టర్మ్ గ్రాడ్యుయేట్ వర్క్ వీసాను ప్రవేశపెట్టారు.

ఈ రెండు వీసాల దరఖాస్తు రుసుము 1,670 న్యూజిలాండ్ డాలర్లు (సుమారు రూ. 85,200) కాగా, దరఖాస్తుదారులు కనీసం 5,000 న్యూజిలాండ్ డాలర్లు (సుమారు రూ. 2.55 లక్షలు) నిధులు చూపాల్సి ఉంటుంది. స్టూడెంట్ వీసా గడువు ముగిసిన మూడు నెలల్లోపు (పీహెచ్‌డీ విద్యార్థులకు ఆరు నెలలు) దరఖాస్తు చేయాలి. జీవితకాలంలో ఒకే ఒకసారి పోస్ట్-స్టడీ వర్క్ వీసా లభిస్తుందని, డిప్లొమా తర్వాత ఏడాది వీసా తీసుకుంటే భవిష్యత్తులో మాస్టర్స్ డిగ్రీపై మూడేళ్ల వీసా పొందే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.