బోస్టన్: అమెరికాలోని బోస్టన్‌లో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థిని కోయ శ్రీజ రెడ్డి (23) ఆచూకీ రెండు వారాలు దాటినా లభించలేదు. కుమార్తె కోసం ఆమె తల్లిదండ్రులు అమెరికా చేరుకుని బోస్టన్ పోలీసులను ఆశ్రయించారు. బోస్టన్‌లో ఉన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కుటుంబాన్ని కలిసి, తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.
ఏం జరిగింది
నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దులాపురం గ్రామానికి చెందిన రైతు కోయ యాదగిరి రెడ్డి, స్వరూప దంపతుల కుమార్తె శ్రీజ. హైదరాబాద్‌లో బీకాం పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం ఎఫ్-1 వీసాపై అమెరికా వెళ్లారు. యూమాస్ బోస్టన్‌లో మాస్టర్స్ చదువుతూ, పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నారు. డోర్చెస్టర్ ప్రాంతంలో ముగ్గురు విద్యార్థులతో కలిసి ఉంటున్నారు.
నవంబర్ 2 రాత్రి సుమారు 9:45 గంటలకు కాసేపు నడకకు వెళ్లి వస్తానని, రూమ్‌మేట్ పుట్టినరోజు కేక్ కటింగ్‌కు తిరిగి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన శ్రీజ తిరిగి రాలేదు. తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. చివరి సిగ్నల్ కార్సన్ బీచ్ తీర ప్రాంతంలో నమోదైంది.
గాలింపు ఇలా
- నవంబర్ 3న మిస్సింగ్ కేసు నమోదు; 4న బోస్టన్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు
- కార్సన్ బీచ్, హార్బర్ పాయింట్, కాజిల్ ఐలాండ్ ప్రాంతాల్లో గాలింపు; ఫోన్ కాల్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు
- బోస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఫిర్యాదు చేసి పోలీసులతో సమన్వయం చేస్తోంది
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సంప్రదించి, సహాయం చేయాలని తానా ప్రతినిధులను కోరారు




