వరంగల్‌ కేంద్రంగా రూపుదిద్దుకున్న స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌ 'రుటూర్‌'ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ఆవిష్కరించారు. ఈ యాప్ రవాణా రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని ఆయన ఆకాంక్షించారు.

తెలంగాణభవన్‌లో శుక్రవారం నిర్వాహకులతో కలిసి కేటీఆర్‌ రుటూర్‌ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రుటూర్‌ ప్రత్యేకత గురించి ఆయన ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.

రుటూర్‌ సంస్థను స్థాపించిన అశోక్‌ను, సీఈవో నిఖిల్‌, సీవోవో క్రాంతి, సీఎఫ్‌వో అక్షయ్‌కు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌ సిస్టంకు రుటూర్‌ మరింత తోడ్పాటునందించాలని ఆయన ఆకాంక్షించారు.

నమ్మకమైన రైడ్‌ సేవలు, వినూత్న సాంకేతికతతో ప్రయాణికులకు సరసమైన ధరల్లో రవాణా సేవలను అందించాలని కేటీఆర్‌ అభిలషించారు. డ్రైవర్ల నుంచి కమీషన్లు వసూలు చేయకుండా సేవలు అందించడం ఈ యాప్ ప్రత్యేకత.

తెలంగాణలో స్టార్టప్‌లకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి ఇది నిదర్శనం. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించడంలో రుటూర్‌ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.