అట్లాంటా: శంకర నేత్రాలయ యూఎస్‌ఏ (SNUSA) అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవకుల అభినందన విందు ఘనంగా జరిగింది. వార్షిక గ్రాండ్ ఫినాలే నిధుల సేకరణ విజయవంతంగా ముగిసిన సందర్భంగా స్థానిక సాంబార్ టు సుక్కా రెస్టారెంట్ బాంక్వెట్ హాల్‌లో ఈ వేడుకను నిర్వహించారు.
దాతల సహకారం, సేవకుల కృషితో గత రెండేళ్లుగా ప్రతి ఏటా 2 మిలియన్ డాలర్ల నిధులను సేకరించి అరుదైన మైలురాయిని అందుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఈ కార్యక్రమానికి ఎస్‌ఎన్‌యూఎస్‌ఏ అడ్వైజరీ బోర్డు సభ్యుడు అరవింద్ కృష్ణస్వామి, జయ కృష్ణస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, అట్లాంటా మాజీ నివాసి మధు తాత పాల్గొన్నారు. ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ కార్యదర్శి రమేశ్ మర్రి తదితరులు హాజరయ్యారు.
అట్లాంటా చాప్టర్ అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి, కోశాధికారి మూర్తి రేకపల్లి, ధర్మకర్తలు శ్రీని రెడ్డి వంగిమల్ల, రాజశేఖర్ ఐల, డాక్టర్ కిశోర్ రెడ్డి రసమల్లు, కల్చరల్ చైర్ నీలిమ గడ్డమనుగు సేవకులను సత్కరించారు. అట్లాంటా గాయకులు ఫణి దొక్క, శిల్ప ఉప్పులూరి, సందీప్ కోవట సంగీత విభావరి నిర్వహించారు.




