హైదరాబాద్‌లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి మృతి చెందారు. బతుకమ్మ పండుగ పూట ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

శంషాబాద్ నుంచి పెద్ద అంబర్‌పేటకు తన చెల్లి రేఖను యాక్టివా బైక్‌పై తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నవీన్, రేఖ ప్రయాణిస్తున్న బైక్‌ను ఒక కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నవీన్, రేఖ అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.