సోషల్ మీడియాలో మహిళగా నటిస్తూ పలువురిని మోసం చేసిన కొండభట్ల పవన్ కుమార్ అనే వ్యక్తిని చార్మినార్ జోన్ ప్రత్యేక బృందం ఆదివారం అరెస్టు చేసింది. ఇతను ఆన్లైన్లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి బాధితులను వలలో వేసుకున్నాడు.
కూకట్‌పల్లిలోని బాలాజీనగర్ నివాసి అయిన పవన్ కుమార్ స్వస్థలం కొత్తగూడెం జిల్లా. ఇతను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్‌తో పాటు దుబాయ్, పాకిస్తాన్, టర్కీ, కెనడా వంటి దేశాల నుండి కూడా బాధితులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా, పవన్ కుమార్ కోల్‌కతాకు చెందిన చందన అనే యువతి ఫోటోలను ఉపయోగించి 27 నకిలీ ఐడీలను సృష్టించినట్లు వెల్లడైంది. ఈ నకిలీ ఖాతాల ద్వారా అమాయకులను ఆకర్షించి మోసాలకు పాల్పడ్డాడు.
ఈ మోసాల ద్వారా పవన్ కుమార్ బాధితుల నుండి రూ.24.16 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, ఒక పెన్ డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.