ఏలూరు / టీ.నర్సాపురం: ప్రవాసాంధ్రుల సేవా సంస్థ తానా ఫౌండేషన్ (2025-2027) ఛైర్మన్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ నల్లూరి ప్రసాద్ ఆదివారం ఏలూరు జిల్లాలోని తన స్వగ్రామం టీ.నర్సాపురంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. తన సతీమణి లక్ష్మితో కలిసి గ్రామానికి వచ్చిన ఆయన, స్థానిక 'మేము సైతం మిత్ర బృందం' సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

డిసెంబర్ 3న జరిగే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా, స్థానిక దివ్యాంగురాలు నార్లపాటి యువతికి దుప్పటి, పండ్లు, వ్యక్తిగత ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు తానా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని డాక్టర్ నల్లూరి ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే టీ.నర్సాపురం హైస్కూల్ విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే సీపీఆర్ (CPR) శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ఎస్.డి. నాసర్ పాషా, కొరివి నాగేశ్వరరావు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ పురస్కార గ్రహీత పింగుల మధు, జమీలా బేగం, అబ్దుల్లా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.