మెల్‌బోర్న్ / కామారెడ్డి: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన చిట్టెడి సుచిత్ర ఆస్ట్రేలియా రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. నవంబర్ 28న జరగనున్న విక్టోరియా రాష్ట్ర ఎన్నికల్లో లావర్టన్ (Laverton) నియోజకవర్గం నుంచి ది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.

లావర్టన్ నియోజకవర్గంలో సుచిత్రతో పాటు మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రవాణా సౌకర్యాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పన, కాలుష్య నియంత్రణ, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం ప్రధాన ఎజెండాగా ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

అంతంపల్లిలోని సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన చిట్టెడి వినోద, గంగారెడ్డి దంపతుల కుమార్తె సుచిత్ర 2014లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. అదే గ్రామానికి చెందిన భర్త రాకేశ్ రెడ్డితో కలిసి ఆమె విక్టోరియాలో స్థిరపడ్డారు.

తమ ఊరి మహిళ విదేశీ గడ్డపై ఎన్నికల బరిలో నిలవడంపై అంతంపల్లి గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 28న జరిగే ఓటింగ్‌లో ఆమె విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.