తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. రాబోయే ఏడాదిలో వంద శాతం కాగిత రహిత పాలనను అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
డిజిటల్ పాలన లక్ష్యంగా రూపొందించిన ప్రణాళికతో ప్రభుత్వ శాఖల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలతో పాటు ప్రజలకు అందించే సేవలను పూర్తిగా ఆన్లైన్ పరిధిలోకి తీసుకువస్తున్నారు.
ఈ క్రమంలో సచివాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ల వరకు ‘ఈ-ఆఫీస్’ వ్యవస్థను విస్తరించారు. విధాన నిర్ణయాల కోసం ‘ఈ-కేబినెట్’ను విజయవంతంగా అమలు చేస్తున్నారు.
ఉద్యోగుల సర్వీసు రికార్డులు, బదిలీలు, పదోన్నతులు, జీతభత్యాల ప్రక్రియను డిజిటలైజ్ చేయనున్నారు. ఉద్యోగులకు ‘హెచ్ఆర్ఎంఎస్’ సేవలు అందుబాటులోకి వస్తాయి.
పైరవీలకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి పథకాల డబ్బులు జమ అవుతాయి. ముఖ్యమంత్రి కార్యాలయం పరిధిలో ‘రియల్ టైమ్ కమాండ్ డ్యాష్‌బోర్డు’ ఏర్పాటు చేస్తున్నారు.