తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కొత్త ఆలోచనలను వెలికితీసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం నిర్ణయం తీసుకుంది. 'తెలంగాణ ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ (టీఎఫ్ఐసీ 1.0)' పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ ఛాలెంజ్‌లో ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు పాల్గొనవచ్చు. ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, సొసైటీ గురుకులాలు, అర్బన్ రెసిడెన్షియల్ బడుల్లోని విద్యార్థులు దీనికి అర్హులు.

సమాజంలో తాము చూసే సమస్యలకు పరిష్కారం చూపేలా వినూత్నమైన ఆలోచనలను పంపాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ కోరారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు మార్గదర్శకాలు పంపారు.

విద్యార్థులు ఒక్కరిగా లేదా ముగ్గురు కలిసి ఒక బృందంగా తమ ఆలోచనలను సమర్పించవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.