తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రికగా ప్రారంభమైన అల్పాహార పథకం అద్భుతమైన ఫలితాలనిస్తోంది. ఈ పథకం వల్ల విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరగడమే కాకుండా, వారిలో ఆరోగ్యపరమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయని ఓ స్వతంత్ర సర్వే స్పష్టం చేసింది.
ఈ పథకంపై ‘థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్’ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 99.9 శాతం మంది విద్యార్థులు టిఫిన్ తింటున్నారని వెల్లడైంది. మెనూలో బోండా, దోశకు అధిక ఆదరణ లభించగా, ఉప్మాకు తక్కువ స్పందన వచ్చింది.
కొడంగల్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు హరే కృష్ణ మూమెంట్ (హెచ్‌కేఎం) చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొడంగల్‌లోని సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా ఈ పథకం అమలవుతోంది.
ఈ పథకం వల్ల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 20 నుంచి 22 శాతం వరకు పెరిగినట్లు సర్వేలో తేలింది. ఇది విద్యార్థుల విద్యాభ్యాసానికి, వారి భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సత్ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఇది తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ పోషకమైన అల్పాహారాన్ని అందించి, వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదపడుతుంది.