అట్లాంటా: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో తెలుగు మూలాలున్న పారిశ్రామికవేత్త శ్రీనివాస్ నిమ్మగడ్డ (నిమ్స్)కు అరుదైన గౌరవం దక్కింది. జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్స్ పర్జర్ నవంబర్ 12న అట్లాంటాలోని జార్జియా స్టేట్ క్యాపిటల్ లో ఆయనకు 'అవుట్ స్టాండింగ్ జార్జియా సిటిజన్' సర్టిఫికెట్ ను అందజేసి, అమెరికాతో పాటు అంతర్జాతీయంగా జార్జియాకు గుడ్ విల్ అంబాసిడర్ గా గుర్తించారు.

2001లో కనెక్టికట్ లోని తన ఇంటి బేస్ మెంట్ లో 'వెన్సాయ్ టెక్నాలజీస్' అనే ఐటీ సంస్థను ప్రారంభించిన శ్రీనివాస్, దాన్ని భారత్, దుబాయ్, ఖతార్ లలో కార్యాలయాలతో బహుళజాతి సంస్థగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఆహార రంగంపై దృష్టి సారించి 2018లో తొలి 'సంక్రాంతి' రెస్టారెంట్ ను ప్రారంభించారు.

భారతీయ వంటకాలను క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) నమూనాలో అందించేందుకు ఐదేళ్ల పాటు కృషి చేసి, ప్రస్తుతం అట్లాంటా మిడ్ టౌన్ లో 'సంక్రాంతి ఇండియన్ కిచెన్' ను నిర్వహిస్తున్నారు. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో ప్రతినెలా ఆహార సేవలు అందించడంతో పాటు, 2026 వేసవిలో అట్లాంటాలో జరిగిన ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్ లో వేలాది మంది అంతర్జాతీయ సందర్శకులకు సేవలందించారు.

మెక్సికన్ 'చిపోట్లే', మెడిటరేనియన్ 'కావా' తరహాలో అమెరికా వ్యాప్తంగా భారతీయ క్యూఎస్ఆర్ బ్రాండ్ ను నిర్మించడమే తన లక్ష్యమని శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే బక్ హెడ్, డౌన్ టౌన్ అట్లాంటాలో మరో రెండు శాఖలను ప్రారంభించి, 2027 నుంచి పొరుగు రాష్ట్రాలకు ఫ్రాంచైజీ విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.