హైదరాబాద్ / వాషింగ్టన్: అమెరికాలో థ్యాంక్స్‌గివింగ్ సెలవుల వారం సమీపిస్తున్న తరుణంలో, అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు భారత్ పర్యటనలపై పునరాలోచిస్తున్నారు. వీసా రెన్యువల్ అపాయింట్మెంట్ల కొరత, విమాన సర్వీసుల అంతరాయాలు, ప్రవేశ ద్వారాల వద్ద పెరిగిన ఇమ్మిగ్రేషన్ తనిఖీల కారణంగా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సూచించింది.
భారత్‌కు వచ్చి తిరిగి అమెరికా వెళ్లే సమయంలో వీసా స్టాంపింగ్ ఆలస్యమైతే చదువులకు, ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుందని తానా ప్రతినిధి నిరంజన్ సువర్ణవరపు పేర్కొన్నారు. థ్యాంక్స్‌గివింగ్ వేడుకలను అమెరికాలోనే జరుపుకోవడం సురక్షితమని విద్యార్థులకు సలహా ఇచ్చారు.
వీసా గడువు ముగిసిన వారు, ఓపీటీ (OPT) దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న విద్యార్థులు విదేశీ ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అపాయింట్మెంట్లు సకాలంలో దొరక్కపోతే నెలల తరబడి చిక్కుకుపోయే ప్రమాదం ఉందని వారు వివరించారు.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ), యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ నవంబర్ 12న, యేల్ యూనివర్సిటీ నవంబర్ 10న అంతర్జాతీయ విద్యార్థులకు అడ్వైజరీలు జారీ చేశాయి. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద ఎలక్ట్రానిక్ పరికరాల తనిఖీలు, అదనపు విచారణ ఎదురుకావచ్చని బర్కిలీ స్పష్టం చేసింది.




