హైదరాబాద్: పిల్లలకు తెలిసిన భాషలో పాఠం చెబితే తరగతి గది ఎలా మారుతుందో వరంగల్ బడి ఒకటి చూపించిందని యునెస్కో నివేదిక పేర్కొంది. ఏడో తరగతి గణితం పాఠాన్ని ఉపాధ్యాయుడు ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ చెప్పడంతో విద్యార్థుల భాగస్వామ్యం 10 శాతం నుంచి 70 శాతం పైకి పెరిగింది. ‘భాషా మ్యాటర్స్: స్టేట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా 2025’ నివేదికను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
యునెస్కో దక్షిణాసియా ప్రాంతీయ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాయి. డాక్టర్ మినతి పండా రాసిన ఈ నివేదిక సిఫార్సులు విధానాలకే పరిమితం కాకుండా నేరుగా తరగతి గదుల్లో అమలు కావాలని నవీన్ నికోలస్ అన్నారు. యునెస్కో నేషనల్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హుమా మసూద్ పాల్గొన్నారు.
తెలంగాణ లెక్కలు
- వరంగల్ అధ్యయనం: 2024-25లో బ్రిటిష్ కౌన్సిల్ కార్యక్రమం కింద, ఎన్ఐటీ వరంగల్ సహా భాగస్వామ్యంతో
- ఒకటి నుంచి పదో తరగతి వరకు 274 పాఠ్యపుస్తకాలు
- 2019 నుంచి తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీ, ఇంగ్లిష్.. ఎనిమిది భాషల్లో బోధన
- ఎస్సీఈఆర్టీ రూపొందించిన తొమ్మిది భాషల డిజిటల్ నిఘంటువు
పది ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ పాఠాన్ని వేర్వేరు భాషల్లో చర్చించి, తెలుగు, దక్కనీ లేదా ఇంగ్లిష్‌లో జవాబులు చెప్పే అవకాశం ఇచ్చినప్పుడు చదివే సామర్థ్యం 30 శాతం మెరుగైందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఇఫ్లూ హైదరాబాద్ అధ్యయనం తేల్చింది. లంబాడీ, గోండి, కొలామి వంటి గిరిజన భాషల పరిరక్షణకూ రాష్ట్రంలో ప్రయత్నాలు సాగుతున్నాయని నివేదిక ప్రస్తావించింది.
మాతృభాష ఆధారిత బహుభాషా విద్య కోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక విధానం, జాతీయ స్థాయిలో ఒక మిషన్ అవసరమని యునెస్కో సిఫార్సు చేసింది. జాతీయ విద్యా విధానం-2020 కూడా కనీసం ఐదో తరగతి వరకు, వీలైతే ఎనిమిదో తరగతి వరకు ఇంటి భాషలో బోధించాలని సూచిస్తోంది. ఈ నివేదికను యునెస్కో గత ఏడాది డిసెంబర్ 16న దిల్లీలో విడుదల చేసింది.
