డల్లాస్ / వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ, ఎఫ్-1 ఓపీటీ వీసాలపై పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయ, ప్రవాసాంధ్ర ఉద్యోగుల గ్రీన్ కార్డ్ ప్రక్రియపై ప్రభావం చూపేలా అమెరికా కార్మిక శాఖ (DOL) సవరించిన ఫారం ETA-9089 ముసాయిదాను విడుదల చేసింది. 'మోడర్నైజింగ్ ది లేబర్ మార్కెట్ టెస్ట్' పేరుతో నవంబర్ 17న ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన ప్రతిపాదిత నిబంధనలకు అనుగుణంగా కొత్త ఫారం, అపెండిక్స్ A నుంచి E వరకు పొందుపరిచారు.
ప్రస్తుతం నియామక ప్రక్రియ (రిక్రూట్మెంట్) రికార్డులను కంపెనీలు తమ వద్ద ఉంచుకుని, ఆడిట్ వచ్చినప్పుడు మాత్రమే సమర్పిస్తున్నాయి. అయితే ప్రతిపాదిత సెక్షన్ I ప్రకారం, దరఖాస్తు చేసే సమయంలోనే సంతకం చేసిన రిక్రూట్మెంట్ నివేదిక, జాబ్ ప్రకటనలు, అమెరికన్ దరఖాస్తుదారుల రెజ్యూమెలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి.
అలాగే ఫారం G.11, G.12 ప్రశ్నల కింద కంపెనీ లేదా క్లయింట్ సైట్లో జరిగిన లేఆఫ్‌ల వివరాల పరిశీలన గడువును 6 నెలల నుంచి 2 సంవత్సరాలకు పెంచారు. అపెండిక్స్ E పై కంపెనీ, అటార్నీ ఇద్దరూ సంతకం చేయకపోయినా, రికార్డులు లోపించినా దరఖాస్తును తిప్పిపంపుతారు; వాటికి ప్రయారిటీ తేదీ కూడా దక్కదు. పత్రికా ప్రకటనల స్థానంలో కనీసం 90 రోజుల ఆన్లైన్ రిక్రూట్మెంట్, షెడ్యూల్ A మినహాయింపుల రద్దు కూడా ప్రతిపాదనల్లో ఉన్నాయి.
అమెరికా కార్మికులకు తొలి ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ మార్పులు చేస్తున్నామని కార్మిక కార్యదర్శి కీత్ సోండర్లింగ్ తెలిపారు. ఈ నిబంధనలు ఇంకా అమలులోకి రాలేదని, 2027 జనవరి మధ్య వరకు ప్రజల అభిప్రాయాలు (60 రోజుల గడువు) స్వీకరించి తుది నిర్ణయం తీసుకుంటారని ఇమిగ్రేషన్ నిపుణులు పేర్కొన్నారు.




