మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఐదవ నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసుతో సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీల గురించి అధికారులు శివశంకర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.
వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసింది.
ఈ హత్య వెనుక రూ.40 కోట్ల సుపారీ లావాదేవీ జరిగిందని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో ఆరోపించింది. ఈ నేపథ్యంలో హత్యకు సంబంధించిన ఆర్థిక మూలాలపై ఈడీ దృష్టి సారించింది.
ఈ కేసులో ఆర్థిక లావాదేవీల దర్యాప్తు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విచారణతో కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.