హైదరాబాద్: ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026' జరగనుంది. గతేడాది 27,500 చ.మీ. విస్తీర్ణంలో సదస్సు నిర్వహించగా, ఈసారి 80,000 చ.మీ.కు పైగా విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన 1,059 కంపెనీలు ప్రదర్శనల్లో పాల్గొనేందుకు ముందుకొచ్చాయి. 220 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు 1,300 మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యేందుకు అంగీకారం తెలిపారు. గతేడాది ఒకే ఎక్స్‌పో హాల్ ఉండగా, ఈసారి 60,600 చ.మీ. విస్తీర్ణంలో ఆరు ఎక్స్‌పో హాళ్లు, 77 సెషన్లను నిర్వహిస్తున్నారు.

సదస్సు వేదికపై తెలంగాణ ప్రభుత్వం 11 కొత్త పారిశ్రామిక, సాంకేతిక పాలసీలను ఆవిష్కరించనుంది. వీటిలో ICT పాలసీ 2.0, GCC పాలసీ, డేటా సెంటర్స్ 2.0, ఎలక్ట్రానిక్స్ & సెమీకండక్టర్స్, ఏరోస్పేస్-డిఫెన్స్-స్పేస్, AVGC పాలసీ, విదేశీ విశ్వవిద్యాలయాల ఆఫ్‌షోర్ క్యాంపస్ పాలసీ ఉన్నాయి.

డిసెంబర్ 7, 8 తేదీల్లో క్లైమేట్ కాన్‌క్లేవ్ నిర్వహించి ఎల్ నినో, కరవు నివారణపై ప్రత్యేక కార్యాచరణను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ప్రధాన సదస్సు అనంతరం డిసెంబర్ 13 వరకు రక్షా ఎక్స్‌పో, ఇండియాజాయ్ ప్రదర్శనలను ప్రజలు సందర్శించేందుకు అనుమతిస్తారు.