అమరావతి / రాజమహేంద్రవరం: విదేశాల్లో తెలుగు యువతకు సురక్షితమైన, నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలను విస్తృతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాజమహేంద్రవరం బొమ్మూరులోని NAC-ASTI ప్రాంగణంలో 'స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్' (SIIC) ఏర్పాటుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఆరోగ్య సంరక్షణ, ఇంజినీరింగ్, నిర్మాణం, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కేంద్రం శిక్షణ అందిస్తుంది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణను, విదేశీ వ్యవహారాల శాఖ గుర్తింపు పొందిన OMCAP విదేశీ నియామకాలు, వీసా సహాయాన్ని పర్యవేక్షిస్తాయి.
జూన్ 2024 నుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమాల ద్వారా 1,993 మందికి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించగా, 525 మందికి శిక్షణ, 457 మందికి మదింపు, 189 మందికి ధ్రువీకరణ పూర్తి చేశారు. ప్రస్తుతం మరో 3,263 మంది శిక్షణ పొందుతున్నారు.
ప్రాజెక్ట్ వసుధ, ప్రాజెక్ట్ సర్వసేతు, ప్రాజెక్ట్ బ్లూ డైమండ్ ద్వారా జర్మనీ, జపాన్, రష్యా, ఇటలీ, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ మార్గాలను రాష్ట్రం సిద్ధం చేస్తోంది. కొత్త SIIC కేంద్రంలో విదేశీ భాషల బోధన, నైపుణ్య పరీక్షలు, ప్రీ-డిపార్చర్ శిక్షణ ఒకే వేదికపై అందుబాటులోకి రానున్నాయి.




