హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) దక్షిణ భాగం నిర్మాణంలో కీలక అడుగు పడింది. రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్, కందుకూరు, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 28 గ్రామాల్లో 1,869.30 ఎకరాల భూసేకరణకు శనివారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది.

ఈ భూముల్లో మొత్తం 75.67 కిలోమీటర్ల రహదారిని నిర్మించనుండగా, అందులో 12 గ్రామాలు షాద్‌నగర్ డివిజన్‌లో ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చిలోపు మూడు దశల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, సమాంతరంగా HMDA ఆధ్వర్యంలో తుది DPRను సిద్ధం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత 28 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత డ్రాఫ్ట్ డిక్లరేషన్, సమగ్ర భూ సర్వే పూర్తి చేసి రైతులకు మెరుగైన పరిహారం అందిస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు.

RRR దక్షిణ భాగానికి రెండు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లను అనుసంధానిస్తున్నారు. కొంగరకలాన్ నుంచి ఆమనగల్లు వరకు 42 కి.మీ. రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు-1, శంషాబాద్ సమీపంలోని బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు 81 కి.మీ. రేడియల్ రోడ్డు-2ను హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్మిస్తోంది.