తిరుపతి / విజయవాడ: అంతర్జాతీయ సరుకు రవాణా, రీ-ఎక్స్‌పోర్ట్ వాణిజ్యాన్ని వేగవంతం చేసేందుకు 9 జిల్లాలతో కూడిన తిరుపతి ఎకనామిక్ రీజియన్ (టీఈఆర్)లో దేశంలోనే తొలి సింగిల్ బాండెడ్ కస్టమ్స్-ఫ్రీ ఎయిర్‌పోర్ట్–పోర్ట్ కారిడార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ ప్రణాళిక కింద దక్షిణ కారిడార్‌గా తిరుపతి విమానాశ్రయం–కృష్ణపట్నం పోర్ట్, ఉత్తర కారిడార్‌గా ప్రతిపాదిత దగదర్తి విమానాశ్రయం–రామాయపట్నం పోర్ట్‌లను ఏకీకృత కస్టమ్స్ నియంత్రణ కిందకు తీసుకురానున్నారు. దుబాయ్‌లోని జెబెల్ అలీ ఫ్రీ జోన్ (JAFZA) తరహాలో విమానాశ్రయం, నౌకాశ్రయం మధ్య ఎలాంటి కస్టమ్స్ అడ్డంకులు లేకుండా సరుకులు నేరుగా రవాణా అవుతాయి.
సముద్ర మార్గం ద్వారా వచ్చిన సరుకును విమానంలో ఎగుమతి చేయడానికి లేదా విమాన సరుకును ఓడరేవుకు పంపడానికి ఈ కారిడార్ వీలు కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఆటో విడిభాగాలు, ఫార్మా, త్వరగా పాడయ్యే ఉత్పత్తులకు ఇది కీలకం కానుంది.
రాష్ట్రం నిర్దేశించుకున్న 50 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి లక్ష్యంలో 70 నుంచి 80 శాతం వాటా తిరుపతి ఎకనామిక్ రీజియన్ నుంచే రానుందని అంచనా. శ్రీసిటీ–నాయుడుపేట పారిశ్రామిక బెల్ట్ ఈ వృద్ధికి ప్రధాన కేంద్రంగా నిలవనుంది.




