అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 1996 బ్యాచ్‌కు చెందిన ఆయనపై క్రిమినల్ విచారణ ముగిసే వరకు లేదా పదవీ విరమణ వరకు, ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నవంబర్ 6న సమావేశమైన సమీక్ష కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు లేదా 2027 మార్చి 31 వరకు సస్పెన్షన్ కొనసాగించాలని కమిటీ సూచించింది. ఈ దశలో సస్పెన్షన్ ఎత్తివేస్తే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, విచారణను ప్రభావితం చేసేందుకు ఆయనకు అవకాశం దొరుకుతుందని కమిటీ అభిప్రాయపడింది. అఖిల భారత సర్వీసుల (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనలు–1969లోని రూల్ 3(3) కింద ఉత్తర్వులు ఇచ్చారు.
ఆరోపణలు ఇవీ
- అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు ‘అగ్ని’ ఎన్ఓసీ వెబ్ పోర్టల్ అభివృద్ధి, నిర్వహణలో ప్రజాధనం దుర్వినియోగం
- సీఐడీ అదనపు డీజీగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై పోలీసులకు శిక్షణ కోసం కేటాయించిన నిధుల దుర్వినియోగం
- 2024 డిసెంబర్లో సస్పెన్షన్; అదే నెల 24న ఏసీబీ కేసు నమోదు
ఏసీబీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కొందరు కీలక సాక్షులను ఇంకా విచారించాల్సి ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, పత్రాలపై ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉంది. శాఖాపరమైన అభియోగాలపై గడువులోగా సంజయ్ లిఖితపూర్వక వివరణ ఇవ్వకపోవడంతో ప్రభుత్వం విచారణాధికారిని, ప్రెజెంటింగ్ అధికారిని నియమించింది. తాజా ఉత్తర్వులపై సంజయ్ స్పందన ఇంకా వెలువడలేదు.




