హైదరాబాద్: సుమారు 125 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర భూ రీసర్వే 416 గ్రామాల్లో పూర్తయింది. వెయ్యికి పైగా గ్రామాల్లో సర్వే ప్రారంభమైంది. తొలి దశలో మొత్తం 2,720 గ్రామాలను ఎంపిక చేశారు. రీసర్వే పురోగతిపై రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.
‘‘రీసర్వేలో జరిగే చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో భూ వివాదానికి దారితీయకూడదు’’ అని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా పారదర్శకంగా, కచ్చితంగా సర్వే చేయాలని సూచించారు.
మంత్రి ఆదేశాలు
- సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి భూకమతానికి భూదార్ నంబర్ కేటాయింపు వేగవంతం
- సర్వే తర్వాత భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు; అభ్యంతరాలు, సూచనలు చెప్పేందుకు అవకాశం
- సర్వే విధానం, హద్దుల నిర్ధారణ, అభ్యంతరాల పరిష్కారంపై గ్రామాల్లో రైతులకు అవగాహన
క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, రైతుల స్పందన, సాంకేతిక అంశాలు, సిబ్బంది పరిస్థితులపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి ఎక్స్‌లో తెలిపారు. భూ వివాదాలు లేని తెలంగాణే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. తొలి దశ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఇంకా గడువు ప్రకటించలేదు.




