విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ అమలు చేస్తున్న AI ఆధారిత పౌర సేవల వేదిక 'పురమిత్ర'కు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ముంబయిలో జరిగిన AI ట్రాన్స్ఫర్మేషన్ కాన్క్లేవ్లో ఇల్లోజ్ మీడియా పరివర్తన్ అవార్డ్స్-2026 కింద 'AI-డ్రివెన్ పబ్లిక్ సర్వీస్ ఇన్నోవేషన్ అవార్డు' లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున C&DMA పి. సంపత్ కుమార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) పురమిత్ర మొబైల్, వెబ్ వేదిక పనిచేస్తోంది. ఆస్తి పన్ను, నీటి పన్ను, పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని ఇది ఒకే చోటకు చేర్చింది.
ఈ ప్లాట్ఫామ్ దాదాపు 47 లక్షల పట్టణ కుటుంబాలకు చేరువ కాగా, 19.09 లక్షల మందికి పైగా పౌరులు నమోదు చేసుకున్నారు. అందిన 1,86,330 ఫిర్యాదుల్లో 1,84,030కు పైగా సమస్యలను SLA ట్రాకింగ్, ఆటోమేటెడ్ ఎస్కలేషన్ ద్వారా పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.
10 లక్షలకు పైగా పౌర సమస్యల చిత్రాలతో శిక్షణ పొందిన AI విజన్ మోడల్, GPS ట్యాగ్ చేసిన ఫొటోలను 8 మున్సిపల్ విభాగాల్లోని 124 ఉప-విభాగాల వారీగా స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బందికి పంపిస్తుంది. BHASHINI ద్వారా తెలుగు, ఇంగ్లిష్లో వాయిస్, టెక్స్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి.




