ముంబై / అమరావతి: AI, డేటా సెంటర్లు, టెలికాం, ఆటోమోటివ్ రంగాల డిమాండ్‌తో భారత్ సెమీకండక్టర్ మార్కెట్ 2026 నాటి $45–50 బిలియన్ల స్థాయి నుంచి 2030 నాటికి $100–110 బిలియన్లకు చేరుతుందని కేర్‌ఎడ్జ్ అడ్వైజరీ తాజా నివేదిక అంచనా వేసింది.

దేశీయ సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించే ₹76,000 కోట్ల ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) కింద ఆమోదం పొందిన 10 ప్రాజెక్టులు ఆరు రాష్ట్రాల్లో ఏర్పాటవుతున్నాయని నివేదిక పేర్కొంది. ఇందులో గుజరాత్, అసోం, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రంగా ఉంది.

అధిక మూలధన వ్యయం, అరుదైన ఖనిజాల దిగుమతులు, నైపుణ్య కొరత వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, కేంద్ర–రాష్ట్ర ప్రోత్సాహకాలతో దేశీయ చిప్ తయారీ వేగం పుంజుకుంటోందని విశ్లేషకులు తెలిపారు.

మరోవైపు తిరుపతి ఎకనామిక్ రీజియన్‌లో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ ఉత్పత్తుల రవాణా కోసం కస్టమ్స్-ఫ్రీ కారిడార్లను కూడా ఏపీ ప్రతిపాదించడంతో రాష్ట్రంలో చిప్ పర్యావరణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.