హైదరాబాద్: మెదడు, వెన్నుపాము గాయాలకు భవిష్యత్తులో మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చే దిశగా హైదరాబాద్‌లోని CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. వయసు పెరిగే కొద్దీ నాడీ కణాలు (న్యూరాన్లు) కోల్పోయే పునరుత్పత్తి సామర్థ్యాన్ని తిరిగి పునరుద్ధరించడంలో 'PATZ1' ప్రోటీన్ కీలకమని గుర్తించారు.

డాక్టర్ ఈశ్వర్య వెంకటేష్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం 'కమ్యూనికేషన్స్ బయాలజీ' జర్నల్‌లో ప్రచురితమైంది. చేపలు, ఉభయచరాలకు భిన్నంగా క్షీరదాల్లో నాడీ కణాల మరమ్మతు సామర్థ్యం పరిమితంగా ఉంటుంది. పెద్దవారిలో నాడీ కణాల పునరుత్పత్తికి అవసరమైన జన్యువులు ఉన్నప్పటికీ, DNA ప్యాకేజింగ్ మార్పుల వల్ల అవి క్రియాశీలకంగా ఉండవని పరిశోధకులు కనుగొన్నారు.

ఎలుకల నమూనాలపై జరిపిన ప్రయోగాల్లో PATZ1 స్థాయిలను పునరుద్ధరించడం ద్వారా DNAపై ఉన్న 'న్యూక్లియోసోమ్' అడ్డంకులను తొలగించి, ఆ జన్యువులను తిరిగి యాక్టివేట్ చేయవచ్చని నిరూపించారు. తద్వారా పాత న్యూరాన్లు యువ న్యూరాన్ల తరహాలో మారుతున్నాయని గుర్తించారు.

అయితే PATZ1 ఒక్కటే నేరుగా నాడీ పెరుగుదలను ప్రేరేపించదని, ఇతర వృద్ధి జన్యువులు సమర్థంగా పనిచేసేలా కణ వాతావరణాన్ని సిద్ధం చేస్తుందని డాక్టర్ వెంకటేష్ వివరించారు. తదుపరి దశలో దీర్ఘకాలిక వెన్నుపాము గాయాలపై కాంబినేషన్ థెరపీలను పరీక్షించనున్నారు.