హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సుల సేవలు గత నెల రోజులుగా నిలిచిపోయాయి. పర్యాటక శాఖ నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ బస్సులు షెడ్డుకే పరిమితమయ్యాయి.

పండుగ సెలవుల్లో నగరాన్ని సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులకు ఈ పరిణామం నిరాశ కలిగిస్తోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) సుమారు రూ.13 కోట్ల ఖర్చుతో ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసింది. నగర పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వీటిని ప్రారంభించారు.

హెచ్‌ఎండీఏ నుంచి బస్సుల నిర్వహణ బాధ్యతలను పర్యాటక శాఖ తీసుకుంది. అయితే, వాటిని నడపడంలో పర్యాటక శాఖ విఫలమైంది. దీంతో వైభవంగా ప్రారంభమైన ఈ బస్సు సేవలు ప్రస్తుతం నిలిచిపోయాయి.